మహారాష్ట్రపై పూర్తి ఫోకస్.. రేపు నాగ్ పూర్ కి కేసీఆర్

మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగులు బలంగా పడుతున్నాయి. ఇప్పటికే 3.5 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి.

Advertisement
Update:2023-06-14 06:49 IST

మహారాష్ట్రపై బీఆర్ఎస్ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. వరుస సభలతో ఆ రాష్ట్రంలో అలజడి సృష్టించిన తెలంగాణ సీఎం కేసీఆర్. రేపు (గురువారం) మరోసారి నాగ్ పూర్ వెళ్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ తొలి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. క్రమక్రమంగా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ కార్యాలయాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్.

3.5 లక్షల 'మహా' సైన్యం..

తెలంగాణ అవతల మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగులు బలంగా పడుతున్నాయి. అక్కడ గులాబి పార్టీకి బలమైన పునాదులు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే 3.5 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. గత నెల 22న సభ్యత్వాల నమోదు మొదలు కాగా, ఈనెల 22వరకు ఆ డ్రైవ్ కొనసాగుతుంంది. గడువు పూర్తయ్యేలోగా మరింతమంది మహారాష్ట్రలో బీఆర్ఎస్ సైనికులుగా మారతారని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు మాణిక్‌ కదం ఆధ్వర్యంలో కిసాన్ సెల్ ద్వారా 2 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇతర సంఘాల ద్వారా లక్షా యాభైవేల మంది బీఆర్ఎస్ సభ్యులయ్యారు.

కొనసాగుతున్న చేరికలు..

ఓవైపు మహారాష్ట్రలో సభ్యత్వాలు జోరుగా సాగుతున్నాయి, ఇటు కీలక నేతలు నేరుగా హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గులాబి కండువా కప్పుకుంటున్నారు. ఔరంగాబాద్‌ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్‌ వినోద్‌ తంబే, వంచిత్‌ బహుజన్‌ అఘాడీ పార్టీ నాయకుడు ప్రవీణ్‌ పవార్‌.. బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఔరంగాబాద్ కి చెందిన కార్పొరేటర్లు, పలువురు వ్యాపారవేత్తలు, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు మొత్తం 30మంది హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో అటు నాగ్ పూర్ లో కూడా చేరికలు జోరందుకున్నాయి.

Tags:    
Advertisement

Similar News