కేసీఆర్ కి అనారోగ్యం.. ఇంటి వద్దనే వైద్యం
వినాయక చవితి తర్వాత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. మరికొన్ని రోజుల్లో ఆయన కోలుకుంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు కేటీఆర్. ఆయన త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు చెప్పినట్టు ప్రకటించారు. వైరల్ ఫీవర్ కారణంగా జ్వరంతోపాటు దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
ఇంటి వద్దనే వైద్యం..
అనారోగ్యంతో ఉన్న కేసీఆర్ కి ఇంటి వద్దనే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ఆయనకు అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. వారం రోజులుగా కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు కేటీఆర్. వారం రోజుల నుంచి ఆయనకు ఇంటి వద్దనే వైద్యం అందుతోంది. అత్యవసరం అయితే ఆస్పత్రికి తరలించేవారు కానీ, స్వల్ప అనారోగ్యం కావడం వల్లే ఇంటి వద్ద చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈనెల 18న ప్రగతి భవన్ లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో కుటుంబంతో పాటు పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత ఆయన బయటకు రాలేదు. అధికారిక సమీక్షల్లో కూడా పాల్గొనలేదు. వినాయక చవితి తర్వాతే కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. మరికొన్ని రోజుల్లో ఆయన కోలుకుంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
♦