ప్రశ్నించే ప్రభుత్వాన్ని పడగొట్టడమే.. మోడీ ప్రభుత్వ విధానమా?: సీఎం కేసీఆర్

మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు వల్ల తెలంగాణ రాష్ట్రం రూ. 3 లక్షల కోట్ల మేర నష్టపోయిందని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే జీఎస్‌డీపీ ఇంకా పెరిగేదని అన్నారు.

Advertisement
Update:2022-12-04 19:06 IST

ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించే ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధానమా అని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతున్నదో గ్రామాల్లో చర్చ జరగాలి. ప్రజలు, మేధావులు, యువత ఈ విషయంపై ఆలోచన చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు.

మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు వల్ల తెలంగాణ రాష్ట్రం రూ. 3 లక్షల కోట్ల మేర నష్టపోయిందని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే జీఎస్‌డీపీ ఇంకా పెరిగేదని అన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు మోడీకి ఎనిమిదేళ్ల సమయం కూడా సరిపోలేదా అని ప్రశ్నించారు. వాటాలు తేల్చేందుకే ఎనిమిదేళ్లు సరిపోకపోతే.. ఇక అనుమతులు ఇచ్చేది ఎప్పుడని అన్నారు. ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పాను. నేను చెప్పిందే చేసి చూపించానని, ఇప్పుడు ఇంటింటికీ నీళ్లు వస్తున్నాయని అన్నారు.

బీజేపీ నేతలు రాష్ట్రానికి చేసేది ఏమీ ఉండదు, కానీ చేసే వాళ్ల కాళ్లలో కట్టెలు పెడతారని మండిపడ్డారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు అనేవి రాజకీయం కోసం కాదు. దేశంలోనే తెలంగాణ రైతు గర్వంగా తలెత్తుకొని నిలబడాలని భావించే వాటిని అమలు చేస్తున్నాము. మీరేం చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. కేసీఆర్, నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని ప్రధాని మోడీ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా పడగొట్టడమే వారి విధానమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో మమత బెనర్జీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు మోడీ చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే వారి ప్రజాస్వామ్య విధానంలా మారిపోయిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి నలుగురు దొంగలు వస్తే వారిని పట్టుకొని జైల్లో పెట్టామని సీఎం గుర్తు చేశారు.

సమైక్య పాలకులు మమ్మల్ని నిరాదరణకు గురి చేశారు.. వలసలతో వలవలపించేను పాలమూరు అనే పాట ఉండేది. కానీ ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడ్డ జిల్లా అంటున్నారు. పోరాటాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోందని వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి కావలసి ఉన్నది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. సంక్షేమంలో మనకు సాటి ఎవరూ లేరు. మహబూబ్‌నగర్‌కు క్రీడా మైదానం, ఆడిటోరియం మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గతంలో రైతు కుటుంబాలు ఆపద్బంధు కోసం కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రైతు ఏ కారణంతో చనిపోయినా రైతు బీమా కింద రూ. 5 లక్షలు వస్తున్నాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు వైద్య కళాశాలలు వస్తాయని ఏనాడైనా అనుకున్నామా? రాత్రింబవళ్లు కష్టపడితేనే తెలంగాణ ఇంత ప్రగతి సాధించిందని కేసీఆర్ వివరించారు.

త్వరలోనే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేసే పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు రూ. 3 లక్షల చొప్పున మంజూరు చేస్తామని.. నియోజకవర్గానికి 1000 ఇళ్లు త్వరలోనే మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News