పాల్ కామెడీ.. గోపాల్ ట్రాజెడీ..
18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కి ఎమ్మెల్యే సీటు ఖర్చయిపోయినా పర్లేదని అనుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అభ్యర్థే అస్త్ర సన్యాసం చేసేశారు కాబట్టి, కార్యకర్తల్లో కూడా ఉత్సాహం నీరుగారిపోయింది. ఆయనకు ఓటు వేసినా అది మురిగిపోయినట్టేనని భావిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మునుగోడులో హోరాహోరీ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ హడావిడి పూర్తిగా తగ్గినట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ ముఖచిత్రం బయటపడిన తర్వాత కాషాయ కండువాలు మునుగోడులో కనుమరుగయ్యాయి. కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ గాంధీ జోడో యాత్రతో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు యధావిధిగా గ్రామాల్లో కలియదిరుగుతున్నారు. ఇక కొత్తగా కేఏ పాల్ కామెడీ మాత్రం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది.
పాల్ వర్సెస్ గోపాల్..
ఓవైపు రాజగోపాల్ రెడ్డి హడావిడి తగ్గిపోగా, మరోవైపు కేఏ పాల్ విన్యాసాలు పెరిగిపోవడం మాత్రం మునుగోడు వాసులకు కాస్త రిలీఫ్ ని ఇచ్చాయి. దోశలు వేయడం, టీ పెట్టడం, కటింగ్ షాప్ కి వెళ్లడం, రైతులా మారి తలగుడ్డ కట్టుకుని సైకిల్ తొక్కడం.. ఇలా రకరకాల ఫోజులిస్తూ కేఏపాల్ మునుగోడులో కలియదిరుగుతున్నారు. సీరియస్ గా ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఆయన కాస్త చల్లబరిచారు. తన విన్యాసాలు, విచిత్ర వేషాలతో మునుగోడులో సందడి చేస్తున్నారు
రాజగోపాల్ రెడ్డి సంగతేంటి..?
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం పూర్తిగా దుప్పటి కప్పేశారు. జ్వరంతో ఆపేసిన ప్రచారం ఇంకా మొదలు కాలేదు. కీలక నేతలు అటువైపు చూడటంలేదు. నడ్డా సహా ఢిల్లీ బ్యాచ్ మొహం చాటేసింది. దీంతో తనకు తాను రంగంలోకి దిగి పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఆగిపోతున్నారు రాజగోపాల్ రెడ్డి. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కి ఎమ్మెల్యే సీటు ఖర్చయిపోయినా పర్లేదని అనుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి అస్త్ర సన్యాసం చేసేశారు కాబట్టి, కార్యకర్తల్లో కూడా ఉత్సాహం నీరుగారిపోయింది. ఆయనకు ఓటు వేసినా అది మురిగిపోయినట్టేనని భావిస్తున్నారు. ప్రస్తుతం మునుగోడు ప్రచార సరళి చూస్తుంటే రాజగోపాల్ రెడ్డిని కేఏ పాల్ మించిపోయేలా కనిపిస్తున్నారు.