ఈటలకు భద్రత పెంచండి.. డీజీపీకి మంత్రి కేటీఆర్ ఫోన్

ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేస్తున్నదెవరు? అసలు ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటనే విషయంపై డీసీపీ సందీప్ రావు విచారణ చేపట్టనున్నారు.

Advertisement
Update:2023-06-29 07:56 IST

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని భార్య ఈటల జమున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈటల జమున ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటల రాజేందర్ భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు. అలాగే బెదిరింపులపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్.. అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే ఈటల జమున ఆరోపణలపై డీజీపీ సమాచారాన్ని తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. అలాగే హుజూరాబాద్‌కు డీసీపీ సందీప్ రావు‌ను పంపించారు. ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేస్తున్నదెవరు? అసలు ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటనే విషయంపై సందీప్ రావు విచారణ చేపట్టనున్నారు. కాగా, రాష్ట్రంలో హత్యారాజకీయాలకు తావు లేదని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్పంచ్ ఎన్నికల నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అన్నీ ప్రశాంతంగా జరిగిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. ఈటల రాజేందర్ భద్రత విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని డీజీపీ చెప్పారు.

ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా పౌరుల రక్షణ బాధ్యత కూడా తమదే అని డీజీపీ చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అవార్డులు అందుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో హత్యారాజకీయాలకు చోటే లేదని డీజీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News