కీలక అధికారి.. నెల రోజులుగా కానరాడేమి?
జీఏడీలో ఎక్కడి ఫైళ్లు అక్కడే.. ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ఉద్యోగుల డిమాండ్
సాధారణ పరిపాలన శాఖ... ప్రజలతో నేరుగా సంబంధం లేకున్నా పరిపాలనలో అత్యంత కీలకమైనది. అలాంటి శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉన్నతాధికారి నెల రోజులుగా కనిపించడం లేదు. ఆ అధికారి ఎక్కడ అని సెక్రటేరియట్ లో నెల రోజులు గా చర్చ జరుగుతోంది. సదరు అధికారి లీవ్ లో వెళ్లాడని ఆ శాఖలో పని చేస్తున్న వాళ్లు చెప్తున్నారు. సదరు అధికారి అందుబాటులో లేకపోవడంతో డీసీపీ, సెక్రెటరీ సర్వీసెస్ తో పాటు సర్వీస్ మ్యాటర్స్ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. సెక్రెటరియేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని స్థాయిల ఉద్యోగులకు సంబంధించిన పనులన్నీ పెండింగులో పడిపోయాయి. ఆ అధికారి పర్యవేక్షిస్తున్న డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ ), జీపీఎం (గ్రీవెన్స్ ఆఫ్ పిటిషన్స్), ఏఆర్ (అడ్మినిస్టేటివ్ రిఫామ్స్)ల పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఏడాది క్రితం జీఏడీలో పోస్టింగ్ దక్కించుకున్న అధికారి నెల రోజులుగా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఆ స్థానంలో మరో అధికారికి పోస్టింగ్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కీలకమైన అధికారికి నెల రోజుల సెలవు ఇచ్చినప్పుడు సీఎస్ ఆ బాధ్యతలు మరొకరికి ఇవ్వకపోవడం ఏమిటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.