ప్రభుత్వానికి దమ్ముంటే ఫార్ములా - ఇ పై చర్చ పెట్టాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనిల్ జాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ఘటనపై చర్చ చేయాలని కోరితే ప్రభుత్వం పారిపోయిందన్నారు. అసెంబ్లీని ఈ ప్రభుత్వం ప్రహసనంగా మార్చేసిందని, అన్ని వ్యవస్థలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రూల్ బుక్ ప్రకారం సభను నడపడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వార్తలు లీకులిచ్చి బతుకుతున్నారని, కేసులు, అరెస్టులు అంటూ వార్తలు రాయించుకుంటున్నారే తప్ప చర్చకు మొహం చాటేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ కు అసెంబ్లీకి వచ్చేందుకు మొఖం లేదన్నారు. కాంగ్రెస్ మోసాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో గొంతు నొక్కొచ్చుకానీ ప్రజాక్షేత్రంలో నొక్కలేరన్నారు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.. సభా నియమాలపై నీతులు చెప్తోన్న ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించిందని, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు తీసుకొని వస్తే స్పీకర్ ఎలా అనుమతించారని ప్రశ్నించారు. లగచర్ల రైతులు జైల్లో మగ్గుతుంటే సీఎం, మంత్రులు రాక్షసానందం పొందుతున్నారని, రైతులు కన్నీరు పెడుతుంటే సీఎం, మంత్రులు జల్లాల్లో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు.