నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు - కేటీఆర్
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీలకు చెందిన ఫామ్ హౌస్ లను తాను చూపిస్తానని, వాటిని కూడా పరిశీలించి వద్దామని కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని.. ఈ ఫార్మ్ హౌస్ ను హైడ్రా త్వరలో కూలగొట్టనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తన మిత్రుడు ప్రదీప్ రెడ్డిది అని.. ఆయన వద్ద నుంచి తాను ఆ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఒకవేళ ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉంటే తానే తన స్నేహితుడికి నచ్చజెప్పి దగ్గరుండి ఆ భవనాన్ని కూల్చి వేయించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. అలాగే ఈ ఫామ్ హౌస్ తో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీలకు చెందిన ఫామ్ హౌస్ లను తాను చూపిస్తానని, వాటిని కూడా పరిశీలించి వద్దామని కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ను కూడా మీడియాకు చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న కట్టడాలను కొద్ది రోజులుగా హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ ను కూడా కూల్చివేస్తారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో జన్వాడలో తనకు సొంతమైన ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని బీఆర్‌ఎస్ నాయకుడు ప్రదీప్ రెడ్డి ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.