కుక్కల్ని కరవమని నేను చెప్పానా..? నాపై బురదజల్లారు
రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరని, తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు విజయలక్ష్మి.
హైదరాబాద్ లో కుక్కకాటుతో బాలుడు చనిపోయిన ఘటన తర్వాత మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మేయర్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కుక్కల్ని ఆమె ఇంటిలో వదిలిపెట్టాలని చెప్పారు. అప్పట్లో ఈ వివాదంపై మేయర్ స్పందించలేదు. తాజాగా మహిళా దినోత్సవ సంబరాల సందర్భంగా ఆమె తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చారు.
‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు. కావాలనే నాపై బురదజల్లారు. ’’ అంటూ మండిపడ్డారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు మేయర్ విజయలక్ష్మి.
రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరని, తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు విజయలక్ష్మి. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారన్నారు. మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్ మేయర్‌గా పనిచేయడం అంత సులువు కాదని అన్నారామె.
ప్రదీప్ కుటుంబానికి సాయం..
వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన చిన్నారి ప్రదీప్ కుటుంబ సభ్యులకు హైదరాబాద్ కార్పొరేషన్ తరపున ఆర్థిక సాయం అందించారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఒక నెల గౌరవ వేతనంతో పాటు GHMC తరఫున మొత్తం రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందించారు.
తాజాగా మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. కుక్కలదాడిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మేయర్ తన ఆవేదన వ్యక్తం చేశారని కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. మరికొందరు మాత్రం, మరోసారి మేయర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.