గంటకు 120 కిలోమీటర్ల వేగం.. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో విశేషాలు ఇవే!

Hyderabad Airport Express Metro: రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31 కిలోమీటర్ల పొడవైన మెట్రోకు సంబంధించి డీపీఆర్ రూపొందించినప్పుడు రెండు రకాల అధ్యయనాలు చేశారు.

Advertisement
Update:2022-12-04 08:39 IST

Hyderabad Airport Express Metro

Hyderabad Airport Express Metro: హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో శంకుస్థాపనకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 9న సీఎం కేసీఆర్ ఈ మెట్రో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మూడేళ్ల కిందటే ఈ మెట్రో కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పట్లో రూ.4,650 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం అది రూ.6,250 కోట్లకు పెరిగింది. ఈ ఖర్చు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే భరించనున్నది. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టును పీపీపీ పద్దతిలో చేపట్టారు. ఎల్ అండ్ టీ దీనికి సంబంధించిన కాంట్రాక్టును దక్కించుకున్నది. అయితే ఎయిర్‌పోర్ట్ మెట్రో మాత్రం పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించనున్నారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31 కిలోమీటర్ల పొడవైన మెట్రోకు సంబంధించి డీపీఆర్ రూపొందించినప్పుడు రెండు రకాల అధ్యయనాలు చేశారు. మొదటిగా ఓఆర్ఆర్ వెంబడి ఈ మెట్రో లైన్‌ను భూగర్భంలో నిర్మించాలని భావించారు.అయితే ఎక్కువ క్రాసింగ్‌లు ఉండటంతో పాటు.. ఎలివేటెడ్ మెట్రోకు తక్కువ ఖర్చు అవుతున్నట్లు స్పష్టం అయ్యింది. అందుకే భూగర్భ మెట్రో ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఈ మార్గంలో కేవలం 2.5 కిలో మీటర్లు మాత్రమే భూగర్భ మార్గంలో పనులు జరుగనున్నాయి.

నానాక్‌రామ్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు ఎలివేటెడ్ మెట్రోను ఓఆర్ఆర్ మధ్యలో నిర్మించనున్నారు. శంషాబాద్ వద్ద లీఫ్ ఇంటర్‌ఛేంజ్ దాటిన తర్వాత ఎయిర్‌పోర్టు లోకి మెట్రో ప్రవేశిస్తుంది. ఈ మార్గంలో మొత్తం 8 స్టేషన్లు ఉండే అవకాశం ఉన్నది. కొన్ని మార్పలు జరిగవచ్చని అధికారులు చెబుతున్నారు. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో మెట్రో దూసుకొని వెళ్తుందని, ఆ విధంగా ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మెట్రో స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ మెట్రో నిర్మాణం తర్వాత హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోతుందని అధికారులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News