ర్యాగింగ్ ఘటనలో విద్యార్థులను సస్పెండ్ చేసిన ఐబీఎస్ కాలేజ్

బాధిత విద్యార్థి హిమాంక్ ని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని కొంతమంది మంత్రి కేటీఆర్ కి ట్యాగ్ చేశారు. ఆయన ఆదేశాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Advertisement
Update:2022-11-13 17:08 IST

హైదరాబాద్ లోని ఐబీఎస్‌ కాలేజీలో హిమాంక్ బన్సల్ అనే లా స్టూడెంట్ పై దాడి చేసిన 12మందిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇదివరకే వారిపై పోలీస్ కేసు నమోదైంది. ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు శంకర్ పల్లి పోలీసులు, మిగతావారికోసం గాలిస్తున్నారు. ఈ కేసు సంచలనంగా మారడంతో విచారణ పకడ్బందీగా చేస్తున్నారు పోలీసులు.

అసలేం జరిగిందంటే..?

ఐబీఎస్ కాలేజీలో ఎల్.ఎల్.బి. ఫస్ట్ ఇయర్ విద్యార్థి హిమాంక్ బన్సల్ ని 12మంది విద్యార్థులు హాస్టల్ రూమ్ లో వేసి చితకబాదారు. అయితే మొదట్లో ఇది ర్యాగింగ్ అనుకున్నారు. ఆ తర్వాత వ్యవహారం చాలా మలుపులు తిరిగింది. ఓ మతాన్ని కించపరిచినందుకు అతడిని కొట్టినట్టు తర్వాత విచారణలో తేలింది. అది కూడా అసలు సమస్య కాదు, హిమాంక్ ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడని, ఆ అమ్మాయి విషయంలో గొడవ జరిగిందని అంటున్నారు. ఆ అమ్మాయి తన సోదరుడికి హిమాంక్ గురించి చెప్పడంతో వారు అతడిని తీవ్రంగా కొట్టారని తెలుస్తోంది.

బాధిత విద్యార్థి హిమాంక్ ని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని కొంతమంది మంత్రి కేటీఆర్ కి ట్యాగ్ చేశారు. ఆయన ఆదేశాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాధిత విద్యార్థి వద్ద ఫిర్యాదు తీసుకుని అతడిని కొట్టినవారిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. జాతీయ మీడియాలో కూడా దీనిపై చర్చ నడుస్తోంది. మతపరమైన దాడిగా దీన్ని కొందరు అభివర్ణిస్తున్నా.. లవ్ మేటర్ లో తేడాలు రావడంలోనే ఈ గొడవలు జరిగాయని తెలుస్తోంది. చివరిగా దాడికి పాల్పడిన స్టూడెంట్స్ అందర్నీ కాలేజీ యాజమాన్యం ఏడాదిపాటు సస్పెండ్ చేసింది.

Tags:    
Advertisement

Similar News