మృత్యువుతో పోరాడి.. హోంగార్డ్ రవీందర్ మృతి

ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వెంటిలేటర్‌ ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు ఉదయం అతడు మృతిచెందాడు.

Advertisement
Update:2023-09-08 10:09 IST

ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన హోంగార్డ్ రవీందర్ మృతి చెందాడు. ఆయన మరణంతో తెలంగాణ పోలీస్ వర్గాల్లో విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం రవీందర్ చనిపోయినట్టు ఆస్పత్రి అధికారులు ధృవీకరించారు. ఆయన డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు.

మూడురోజులు మృత్యువుతో పోరాటం..

పాతబస్తీ ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన రవీందర్.. 15 ఏళ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. జీతం ఆలస్యమైందనే కారణంతో మనస్తాపం చెందిన రవీందర్ మంగళవారం గోషామహల్ కమాండెంట్ ఆఫీసు దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 60 శాతానికి పైగా శరీరం కాలడంతో ముందుగా ఉస్మానియాకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కాంచన్‌ బాగ్‌ లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వెంటిలేటర్‌ ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు ఉదయం అతడు మృతిచెందాడు.

ఈనెల 3వతేదీన జీతం పడిందేమోనని ఏటీఎంకి వెళ్లి చూసుకున్నాడు రవీందర్. బ్యాలెన్స్ చూపించకపోవడంతో, కమాండెంట్ ఆఫీస్ కి వెళ్లి వాకబు చేశాడు. చెక్కులు రెడీగా ఉన్నాయని, ఒకటి రెండు రోజుల్లో అవి డిపాజిట్ చేస్తారని అక్కడి సిబ్బంది తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందులతోపాటు జీతం ఆలస్యం కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 

Tags:    
Advertisement

Similar News