అచ్చంపేటలో అర్ధరాత్రి టెన్షన్... MLAపై దాడి
అయితే కారును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్లు, కర్రలతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు రెండు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్స్‌కు తరలించారు. దాడిలో గాయపడిన ఎమ్మెల్యే బాలరాజుకు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
అసలు ఏం జరిగిందంటే..! అచ్చంపేటలోని అంబేద్కర్ సర్కిల్‌లో రాత్రి ఓ కారును అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కారులో ఎమ్మెల్యే బాలరాజు డబ్బు తరలిస్తున్నారని ఆరోపించారు. అయితే కారును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు గువ్వల బాలరాజు, వంశీకృష్ణ అచ్చంపేట సర్కిల్‌కు చేరుకున్నారు. దీంతో రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలకు దిగాయి. మరోసారి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు కారును ఆపారన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. పోలీసులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదన్నారు. అయితే కారులో డబ్బు లేదని.. కేవలం ఫొటో కెమెరాలకు సంబంధించి బ్యాగులే ఉన్నాయన్నారు అచ్చంపేట సీఐ. ఘటనపై విచారణ జరుపుతామన్నారు.