తెలంగాణలో భారీ వర్షాలు.. విరామం లేకుండా పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్

క్షేత్ర స్థాయిలో సహాయక చర్యల కోసం అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి దిశా నిర్ధేశనం చేశారు.

Advertisement
Update:2023-07-27 23:00 IST

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను సీఎం కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరదలు, ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్ర స్థాయిలో అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. వరదలు, భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

క్షేత్ర స్థాయిలో సహాయక చర్యల కోసం అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి దిశా నిర్ధేశనం చేశారు. వరదల కారణంగా ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండటంతో.. ఎప్పటికప్పుడు నీటికి కిందికి వదలాలని.. సమయస్పూర్తితో వ్యవహరించాలని ఈఎన్సీలకు, చీఫ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో రక్షణ, పునరావాస చర్యలు తీసుకోవాలని.. వైద్యం, ఆహారం అందజేయాలని కేసీఆర్ సూచించారు.

భారీ వర్షాల కారనంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రజలను రక్షిస్తూ, ప్రాణ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగంతో టచ్‌లోనే ఉన్నారు. మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్షేత్ర స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో వరద బాధిత జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతతినిధులు ముంపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్న సీఎం వెంటనే సీఎస్ శాంతికుమారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వచ్చారు.

ఒకవైపు సీఎం కేసీఆర్ పలు మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్త చేస్తున్నారు. మరోవైపు సీఎం శాంతికుమారి.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులతో సమీక్షలు, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ముంపునకు గురైన ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడమే కాకుండా.. రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆహారం, వైద్యం తదితర సామాగ్రిని సంబంధిత శాఖల ద్వారా పంపించేలా చర్యలు చేపట్టారు.

రాష్ట్రంలో వర్షాల వల్ల అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని.. విపత్తుల నిర్వహణ శాఖ, ఫైర్ సర్వీసుల శాఖ, పోలీస్ శాఖలను సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో స్టేట్ లెవెల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి డీజీసీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించడానికి పోలీసుల సాయం చేస్తున్నారు.

తెలంగాణలో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని.. అన్ని ప్రాజెక్టుల వద్ద ఇన్‌ఫ్లోను ముందుగా అంచనా వేసి.. దానికి అనుగుణంగా వరద నీటిని కిందకు వదలాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఆర్ఎస్పీ, కాళేశ్వరం, కడెం, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజరనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్లు చేసి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు అన్ని ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు.

మంత్రులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం కేసీఆర్..

రాష్ట్రంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణనష్టం జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. వానలోనే తడుస్తూ.. ప్రజలను పరామర్శించారు. రక్షణ చర్యలపై అధికారులు సూచనలు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సహాయక చర్యలు చేపట్టేలా జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి.. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. నీట మునిగిన మోరంచపల్లి గ్రామంలోని ప్రజలను సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ములుగు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రి సత్యవతి స్వయంగా పర్యవేక్షించారు. ఈ రాత్రికి ఆమె అక్కడే బస చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయనున్నారు.

ధర్మపురి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. అక్కడ పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి ఆహారం, దుస్తులు అందించారు. మంత్రి హరీశ్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కూడా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి.. అవసరమైతే అత్యవసర వైద్య సదుపాయం అందించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరావాస సహాయక చర్యలు చేపట్టారు. ప్రశాంత్ రెడ్డికి కూడా సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని స్థానిక పరిస్థితులను మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమీక్షించారు.

కడెం ప్రాజెక్టు పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడిగి సీఎం తెలుసుకున్నారు. భద్రాచలంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రత్యేక అధికారి (హైదరాబాద్ కలెక్టర్) అనుదీప్‌తో కలిసి గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ వారి సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మంత్రి పువ్వాడను అడిగి సీఎం కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారు.

ములుగు, వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితిని జగదీశ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నల్గొండలో మూసీ తదితర ప్రాంతాల్లో రక్షణ చర్యలకై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లోని ముంపు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ పర్యవేక్షించారు. ఇండ్లలోకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలోని వరద పరిస్థితిని మంత్రి గంగుల కమలాకర్‌తో చర్చించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం భారీ వర్షాల పరిస్థితిని తెలుసుకుంటూ.. క్షేత్ర స్థాయిలో అధికారులు, మంత్రులను అప్రమత్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News