రేపటి నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ, ఏపీల్లో అతి భారీ వర్షాలు!
తెలంగాణలో రేపటి నుంచి 72 గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ ను వానలు వదిలేలా లేవు. మరో మూడు రోజుల పాటు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
గత కొద్ది రోజులుగా హైద్రాబాద్ తో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అయితే ఇంకా వర్షాలు ఆగే సూచనలు కనపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో మరో ఆవర్తనం ఏర్పడినందువల్ల మరో మూడు రోజుల పాటు భారీ, అతి భారీ వర్షాలు తప్పేట్టు లేవు.
మంగళవారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
కాగా, ఏపీ సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణశాఖ పేర్కొంది. అలాగే రాబోయే 72 గంటల్లో ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ తో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది.