మునుగోడు బైపోల్.. ఏపీలో జోరుగా బెట్టింగ్

కేవలం టీవీలు, పేపర్లలో వచ్చే అంచనాలే కాకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోడానికి బెట్టింగ్ బృందాలు సర్వేలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ సర్వేల ప్రకారం ఎవరిపై బెట్టింగ్ పెట్టాలి, ఎంత పెట్టాలనేదానిపై ఓ అవగాహన వస్తుంది.

Advertisement
Update:2022-10-26 16:55 IST

కాదేదీ బెట్టింగ్‌కి అనర్హం అంటారు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయ వేడి పుట్టిస్తే, ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు ప్రధాన కాలక్షేపంగా మారింది. క్రికెట్, కోడిపందాలు.. ఇలా దేనిపైన అయినా పందాలు కాసే బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు మునుగోడు ఉప సమరంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బెట్టింగ్ లు మొదలుపెట్టారు.

ఎన్నికల ప్రచారంలో దాదాపుగా ఏ పార్టీ పరిస్థితి ఏంటనే విషయంపై అంచనాలు బయటకొచ్చాయి. దీంతో ఇప్పటినుంచే పందాలు కడుతున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ బెట్టింగ్ మరింత జోరుగా సాగే అవకాశముంది. పోలింగ్ రోజు ఓటరు ఏవైపు మొగ్గు చూపారనే విషయం తెలిస్తే వారికి అనుకూలంగా బెట్టింగ్ లు కడుతుంటారు. ప్రస్తుతానికి కేవలం ప్రచార హోరు, సర్వేల జోరు చూసి చాలామంది పందాలు కాస్తున్నట్టు తెలుస్తోంది.

మునుగోడు బై పోల్ గెలుపోటములపై ఇప్పటికే వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. కేవలం టీవీలు, పేపర్లలో వచ్చే అంచనాలే కాకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోడానికి బెట్టింగ్ బృందాలు సర్వేలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ సర్వేల ప్రకారం ఎవరిపై బెట్టింగ్ పెట్టాలి, ఎంత పెట్టాలనేదానిపై ఓ అవగాహన వస్తుంది. ఓటరు నాడి తెలుసుకోడానికి ఏపీకి చెందిన కొందరు యువకులు మునుగోడులో మకాం పెట్టారని తెలుస్తోంది. ప్రచార సరళి, మారుతున్న కండువాలు, జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు బెట్టింగ్ ముఠాలకు వీరు సమాచారం ఇస్తున్నారట. ఏపీ బెట్టింగ్ రాయుళ్లతోపాటు, స్థానికంగా కూడా చాలామంది బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ ఉన్నట్టు బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ పై బెట్టింగ్ వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

Tags:    
Advertisement

Similar News