అందులో ఫ్లాపు.. ఇందులో తోపు.. రేవంత్ పై హరీష్ సెటైర్లు
రేవంత్ రెడ్డి గాడ్ ఫాదర్స్‌కే తాము భయపడలేదని, అలాంటిది ఆయన తాటాకు చప్పుళ్లకు భయపడతామా అని అన్నారు హరీష్ రావు.
రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ గతంలో హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. తాము రుణమాఫీ చేశామని, హరీష్ తన మాటపై నిలబడి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రుణమాఫీ పేరుతో మోసం జరిగిందని, సగం మంది లబ్ధిదారులను అనర్హులుగా చేశారని రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డేనని అంటున్నారు హరీష్ రావు. తాజా ప్రెస్ మీట్ లో మరోసారి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు.
సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫ్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు అంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు. రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు కావాలని కేబినెట్ మీటింగ్ లో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి, 14 వేల కోట్లు కోత పెట్టారని అన్నారు. తెలంగాణలోని ఏ ప్రాంతానికి వెళ్లి అడిగినా రుణమాఫీ కాని రైతుల ఘోష వినపడుతుందని చెప్పారు. రేవంత్ ఏరియాకి వెళ్లినా, తన ఏరియాకి వచ్చినా సరే.. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే, టైమ్ డేట్ ఆయన చెప్పినా సరే, తనను చెప్పమన్నా సరే.. రుణమాఫీపై రైతుల దగ్గరే తేల్చుకుందామని సవాల్ విసిరారు హరీష్ రావు.
ప్రజల దగ్గరకే కాదు, రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టిన దేవుళ్లందరి దగ్గరికీ వెళ్లి ఆయన చేసిన మోసాన్ని చెప్పి, ఆయనపై కోపాన్ని ప్రజలపై చూపెట్టొద్దని ప్రార్థిస్తానన్నారు హరీష్ రావు. మెదక్ చర్చికి వెళ్తానని, జహంగీర్ పీర్ల దర్గాకి కూడా వెళ్తానన్నారు. ప్రజల్ని మోసం చేసిన సీఎం, దేవుళ్లని కూడా మోసం చేశారన్నారు. రేవంత్ రెడ్డి తీరు దొంగే జనంలోకి వచ్చి దొంగా దొంగా అన్నట్టుగా ఉందన్నారు. ఆయన పాక్షికంగా రుణమాఫీ చేశారని, పూర్తిగా చేయలేదన్నారు. రేవంత్ కి నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి గాడ్ ఫాదర్స్‌కే తాము భయపడలేదని, అలాంటిది ఆయన తాటాకు చప్పుళ్లకు భయపడతామా అని అన్నారు హరీష్ రావు. ప్రశ్నించే ప్రతిపక్షం చచ్చిపోవాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని మండిపడ్డారు. తాము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లమని, అసాధ్యమన్న తెలంగాణనే సాధించిన వాళ్లమని.. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు బుల్డోజ్ చేస్తే భయపడతామా అని అన్నారు హరీష్ రావు.