ఒక సీటు వాడితో ఏం పని అవుతుంది..?

దుబ్బాకలో ఏ హామీ నెరవేరకపోయినా.. ఆటోలో సిద్ధిపేటకు వచ్చి తనకు చెప్పొచ్చన్నారు హరీష్ రావు. ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేని రఘునందన్ రావు.. టీవీ చర్చల్లో లొల్లిపెడుతున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2023-11-22 14:14 IST

తెలంగాణలో అసలు బీజేపీ ప్రభుత్వం వస్తుందా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. పోయినసారి బీజేపీకి ఒక సీటు వచ్చిందని, ఈసారి ఆ ఒక్కటి కూడా రాదని, డకౌట్ అవుతుందని అన్నారు. అసలు ఒక సీటు వాడితో ఏమవుతుందన్నారు. అలాంటప్పుడు మనం పరేషాన్ కావడమెందుకని ప్రశ్నించారు హరీష్ రావు. దుబ్బాకలో బీజేపీకి ఒక్క ఓటు పడినా వృథాయే అని చెప్పారు. సీఎం కేసీఆర్ నిలబెట్టిన కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మిరుదొడ్డిలో రోడ్ షో నిర్వహించిన హరీష్ రావు, అభ్యర్థి ప్రభాకర్ రెడ్డితో కలసి ప్రచారం చేశారు.


ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు చాలా హామీలిచ్చారని వాటిల్లో కనీసం ఒక్కటయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఎవరింట్లో పెళ్లి అయినా పుస్తెలు, బట్టలు పంపుతానన్నారని, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.3వేల పెన్షన్ ఇస్తానన్నారని, నిరుద్యోగికి నెలకు రూ.3వేలు ఇస్తానన్నారని.. రైతులకు రెండెడ్లు ఒక బండి ఇస్తానని కూడా రఘునందన్ చెప్పారని అందులో ఒక్కటయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపించి.. ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారని, ప్రజలు భూములు కోల్పోతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మిరుదొడ్డి, దుబ్బాక, దౌల్తాబాద్.. ఎక్కడైనా ఎవరికీ ఒక్క గుంట భూమి కూడా పోదని చెప్పారు హరీష్ రావు. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు.. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా చేస్తామని హామీ ఇచ్చారు.

దుబ్బాకలో ఏ హామీ నెరవేరకపోయినా.. ఆటోలో సిద్ధిపేటకు వచ్చి తనకు చెప్పొచ్చన్నారు హరీష్ రావు. ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేని రఘునందన్ రావు.. టీవీ చర్చల్లో లొల్లిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతుల్లో ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని, ఈ దొంగల చేతుల్లో పడితే ఆగమవుతుందన్నారు. గతిలేని సంసారం ఎల్లదీయొచ్చు కానీ, శృతిలేని సంసారం నడపలేమని అన్నట్టుగా.. కాంగ్రెస్ లో అందరూ ముఖ్యమంత్రులేనని వారితో ఏమీ కాదని అన్నారు. అంతమంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్న శృతిలేని కాంగ్రెస్ చేతిలో పడితే ఆగమైపోతామని హెచ్చరించారు హరీష్ రావు.



Tags:    
Advertisement

Similar News