రాహుల్ వ్యాఖ్యలపై హరీష్ ఘాటు రియాక్షన్

తమది దొరల తెలంగాణ అయితే, కాంగ్రెస్‌ది దొంగలు, బ్రోకర్లు, ముఠాల తెలంగాణనా? అని ప్రశ్నించారు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీటీమ్‌ కాదని, ప్రజల టీమ్‌ అని, ప్రజలే తమకు హైకమాండ్‌ అని తేల్చిచెప్పారు.

Advertisement
Update:2023-10-19 09:04 IST

ములుగు జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగం అంతా అబద్ధాలమయం అని అన్నారు మంత్రి హరీష్ రావు. అది గోబెల్స్ ప్రచారం మాత్రమేనన్నారు. పదే పదే అబద్ధాలు చెప్పి, వాటిని నిజాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.85 వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు రాహుల్‌ ఆరోపించడాన్ని అతిపెద్ద జోక్‌గా పేర్కొన్నారు హరీష్ రావు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అని అన్నారు.

ఆ చరిత్ర కాంగ్రెస్ కి ఉందా..?

తాము గెలిచిన రాష్ట్రాల్లో అన్ని హామీలు అమలు చేశామని రాహుల్ గాంధీ ములుగు సభలో ధీమాగా చెప్పారు. కానీ మేనిఫెస్టోలు అమలు చేసిన చరిత్ర అసలు కాంగ్రెస్ కి లేదని విమర్శించారు హరీష్ రావు. 2009లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో హామీలతోపాటు.. అందులో లేనివాటిని కూడా అమలు చేసి చూపించిందన్నారు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ అమలు చేయలేనివాటిని కేవలం పదేళ్లలో కేసీఆర్ అమలు చేశారన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్‌ అంటేనే ఉత్త మాటలు, మూటలు, ముఠాలు, కుమ్ములాటలని మరోసారి ఎద్దేవా చేశారు హరీష్ రావు. అసెంబ్లీ టికెట్లను సైతం అమ్ముకుంటున్నట్టు స్వయంగా ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారని చెప్పారు. అనేక పార్టీలు మారిన చరిత్ర టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డిదని, సోనియాను ‘బలిదేవత’ అన్నాడని గుర్తు చేశారు. తమది దొరల తెలంగాణ అయితే, కాంగ్రెస్‌ది దొంగలు, బ్రోకర్లు, ముఠాల తెలంగాణనా? అని ప్రశ్నించారు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీటీమ్‌ కాదని, ప్రజల టీమ్‌ అని, ప్రజలే తమకు హైకమాండ్‌ అని తేల్చిచెప్పారు.

Tags:    
Advertisement

Similar News