పోలవరం పూర్తి చేసి మాట్లాడండి.. తగ్గేది లేదన్న హరీష్

తాను ఆంధ్ర‌ప్రదేశ్ ప్రజల్ని తిట్టలేదని, కానీ కొంత మంది నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని చెప్పారు. వాస్తవానికి తాను ఏపీ ప్రజల పక్షానే మాట్లాడానన్నారు హరీష్.

Advertisement
Update:2023-04-17 15:27 IST

ఏపీ-తెలంగాణ మధ్య మాటల యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ పవన్ వీడియో విడుదల చేయడం, దానిపై వైసీపీ నేతలు రియాక్ట్ కావడంతో ఇది ఆరని చిచ్చులా మారింది. తాజాగా మరోసారి హరీష్ రావు కౌంటర్లిచ్చారు. ఈసారి ఇంకాస్త ఘాటుగా వైసీపీ నేతల చేతగానితనాన్ని విమర్శించారు. ముందు పోలవరం కట్టండి, మా కాళేశ్వరం లాగా నీళ్లిచ్చి అప్పుడు మాట్లాడండి అంటూ చురకలంటించారు.

ఉలుకెందుకు..?

సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ రావు, మరోసారి వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. ఉన్నమాటంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. తాను ఆంధ్ర‌ప్రదేశ్ ప్రజల్ని తిట్టలేదని, కానీ కొంత మంది నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని చెప్పారు. వాస్తవానికి తాను ఏపీ ప్రజల పక్షానే మాట్లాడానన్నారు. వారికి చేతనైతే ఏపీకి జాతీయ హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు కోసం పోరాడాలన్నారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీలేదని, తెలంగాణ ఎంత గొప్పగా ఉందో పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పానన్నారు హరీష్ రావు.

మరోసారి ఉలిక్కి పడతారా..?

హరీష్ రావు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు రెట్టించినందుకే ఓసారి వారి వైఫల్యాలను ఎండగట్టారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, విశాఖ ఉక్కు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని హితవు పలికారు. అయినా కూడా వైసీపీ తగ్గకపోయే సరికి పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాన్ని తాజాగా ఎండగట్టారు. మరి దీనికి కూడా వైసీపీ నుంచి రియాక్షన్లు వస్తాయా, లేక సైలెంట్ గా ఉంటారా.. వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News