కాంగ్రెస్ టార్గెట్ రూ.1500 కోట్లు.. దొరికింది 42కోట్లే - హరీష్ రావు

కర్నాటకలో కొత్తగా ఇల్లు కట్టుకునేవారి నుంచి చదరపు అడుక్కి 75 రూపాయలు కాంగ్రెస్ ట్యాక్స్ వసూలు చేస్తోందని, ఆ సొమ్మంతా తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు హరీష్ రావు.

Advertisement
Update:2023-10-13 13:25 IST

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 1500కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తోందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. కర్ణాట‌క‌ అక్రమ సంపాదన అంతా తెలంగాణకు తరలించాలనుకుంటున్నారని, ఈ తరలింపుల్లో భాగంగా ఈరోజు ఐటీ దాడుల్లో 42కోట్ల రూపాయలు దొరికాయని వివరించారు. కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లో ఈ సొమ్ము దొరికిందని, ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. మెదక్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


కర్ణాట‌క‌లో బీజేపీ అధికారంలో ఉండగా 40 శాతం కమీషన్ గవర్నమెంట్ అంటూ నానా యాగీ చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 50 శాతం కమీషన్ వసూలు చేస్తోందన్నారు హరీష్ రావు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము తెలంగాణకి తరలిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాట‌క‌లో కొత్తగా ఇల్లు కట్టుకునేవారినుంచి చదరపు అడుక్కి 75 రూపాయలు కాంగ్రెస్ ట్యాక్స్ వసూలు చేస్తోందని, ఆ సొమ్మంతా తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు హరీష్ రావు.

తెలంగాణలో గెలుస్తామని కాంగ్రెస్ అనుకోవడం పగటి కల అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ లో డబ్బులున్నోళ్లకే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ కొనలేరని అన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండగలాగా చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ కి మాత్రమే దక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లలో అభ్యర్థులు దొరకడంలేదని, పక్క పార్టీల నుంచి వచ్చేవాళ్ళ కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తోందని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పార్టీది సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో వారికి బలం లేదన్నారు హరీష్ రావు.


Tags:    
Advertisement

Similar News