రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం -హరీష్ రావు
రైతు ఆత్మహత్య వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు ఆత్మహత్యని రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ అంటోంది. అన్నదాత ఊపిరి పోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
పురుగుమంది తాగి ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాత వీడియో తెలంగాణలో సంచలనంగా మారింది. తన పొలాన్ని కొంతమంది ధ్వంసం చేశారని, తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్డ ప్రభాకర్ వీడియోలో వేడుకున్నారు. ఆ వీడియోను సీఎం, డిప్యూటీ సీఎం వరకు చేరేలా చూడాలన్నారు. పురుగుల మందు తాగిన ఆ రైతు చనిపోయారు. సోషల్ మీడియాలో రైతు వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగింది. సీఎం రేవంత్ రెడ్డి, రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతు పురుగుమందు తాగుతున్నప్పుడు వీడియో తీసినవారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఈ ఘటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఖమ్మం జిల్లా రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి చనిపోతున్నానని రైతు స్వయంగా ఆ వీడియోలో చెప్పారని గుర్తు చేశారు. సీఎం పేరు ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభాకర్ ఆత్మహత్య కారకులను వదిలేసి, వీడియో తీసినవారిపై కేసు పెట్టడం విడ్డూరమన్నారు హరీష్‌రావు. ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.
రైతు ఆత్మహత్య వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు ఆత్మహత్యని రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ అంటోంది. అన్నదాత ఊపిరి పోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రైతు ప్రభాకర్ చివరి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.