తెలంగాణలో బీజేపీ లేవదు, కాంగ్రెస్ గెలవదు

ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని చెప్పారు.

Advertisement
Update:2023-10-04 16:45 IST

తెలంగాణలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. మీకు మాటల సర్కార్ కావాలా, లేక చేతల సర్కార్ కావాలా అంటూ నారాయణపేట జిల్లావాసుల్ని ప్రశ్నించారు. కోస్గిలో 150 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో హరీష్ రావు పాల్గొన్నారు.


మహిళలకు పెద్దపీట..

తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల కాలేదు. మేనిఫెస్టోలో అందరికీ శుభవార్తలుంటాయని కొన్నిరోజులుగా మంత్రి హరీష్ చెబుతున్న విషయం తెలిసిందే. నారాయణ పేట సభలో కూడా ఆయన మేనిఫెస్టో గురించి ప్రస్తావించారు. మహిళలు మరింత బలోపేతమయ్యేలా కేసీఆర్‌ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై మరింత ఆసక్తిని పెంచారు.

రేవంత్ జైలుకెళ్లడం ఖాయం..

ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్‌ నియోజకవర్గంలో లక్షా యాభైవేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక నేతలు చతికిలపడ్డారని, అలాంటివారు తెలంగాణలో ఏదో చేసేస్తామంటే ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు హరీష్ రావు. కోస్గిని రెవెన్యూ డివిజన్‌ చేయడం, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేసే విషయంలో సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


Tags:    
Advertisement

Similar News