గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలు కానున్నది.
సొంత జాగా ఉన్న పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పేదలకు మూడు విడతల్లో ఈ సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ గతంలోనే ఆమోదించింది. ఈ మేరకు గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. మహిళల పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 25లో పేర్కొన్నది.
రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలు కానున్నది. రెండు గదులతో కూడిన ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నట్లు జీవోలో పేర్కొన్నది. సొంత ఇంటి స్థలం ఉండి.. ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4 లక్షల యూనిట్లు మంజూరు చేయనున్నది. ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షల చొప్పుల ఆర్థిక సాయం అందనున్నది. గతంలోనే కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది.
మొదటి దశలో తెలంగాణ ప్రభుత్వం 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయనున్నది. ఒక్కో నియోజకవర్గానికి 3,000 చొప్పున 119 నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు కానున్నది. మరో 43 వేల ఇళ్లు.. రాష్ట్ర కోటాలో ప్రత్యేక అనుమతి ఇవ్వనున్నది. లబ్దిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం మూడు దఫాలుగా ఖాతాల్లో జమ కానున్నాయి.
ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన బడ్జెట్‌ను కూడా కేటాయించింది. జూలై నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కావడంతో.. అధికారులు లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.