అలసిపోతాం.. సెలవు ఇప్పించండి
వారి వినతిపై సానుకూలంగా స్పందించారు సీఈఓ వికాస్ రాజ్. 28వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ అందించి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఓ వైపు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి వికాస్ రాజ్ ని కలసి రైతుబంధు గురించి వినతిపత్రాలు ఇచ్చి వచ్చారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ఈ రోజు వికాస్ రాజ్ ని కలిశారు. ఎస్టీయూ, పీఆర్టీయూ నేతలు ఎన్నికల అధికారిని కలసి తమ వినతులు విన్నవించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
పోస్టల్ బ్యాలెట్లు అందలేదు..
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్లు సరిగా అందలేదని తెలిపారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. కేవలం 50 శాతం మందికి మాత్రమే ఓటు హక్కు వినియోగానికి పోస్టల్ బ్యాలెట్లు అందాయని చెప్పారు. మిగతా వారికి కూడా త్వరగా పోస్టల్ బ్యాలెట్లు ఇప్పించాలన్నారు. మెదక్, నల్గొండతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఓటు విలువ తెలిపే తమకు ఓటు వేసే అవకాశం ఇవ్వకపోవడం దారుణం అన్నారు ఉపాధ్యాయులు. వారి వినతిపై సానుకూలంగా స్పందించారు సీఈఓ వికాస్ రాజ్. 28వ తేదీ వరకు అందరికీ పోస్టల్ బ్యాలెట్ అందించి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సెలవు ఇప్పించండి..
ఇక పోలింగ్ తర్వాతి రోజు సెలవు ఇప్పించాలని సీఈఓ వికాస్ రాజ్ ని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. ఇతర డిపార్ట్ మెంట్ల ఉద్యోగులకు పోలింగ్ తర్వాతి రోజు విధులకు హాజరయ్యే విషయంలో వెసులుబాటు ఉందని, తమకు కూడా సెలవు ఇప్పించాలని కోరారు. పోలింగ్ రోజు సమస్యాత్మక ప్రాంతాలల్లో డ్యూటీ చేసేవారికి ఇబ్బందులుంటాయని, మహిళలకు కూడా తర్వాతి రోజు డ్యూటీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని.. పోలింగ్ తర్వాతి రోజు సెలవు ఇవ్వాలని కోరారు.
♦