రోడ్డుమీదకు మీ ప్రజాపాలన దరఖాస్తులు!

కూకట్‌పల్లి వై జంక్షన్‌ దగ్గర ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. వెనకాల ఓ అట్టపెట్ట ఉంది. అది చినిగిపోవడంతో ఒకేసారి ఆ పేపర్లన్నీ రోడ్డుమీద చిందర వందరగా ఎగిరిపడ్డాయి.

Advertisement
Update:2024-01-09 08:52 IST

కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే రేవంత్ సర్కారు తెచ్చిన ప్రజాపాలనకు అద్భుత స్పందన వచ్చింది. కొత్త ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకోవాలని జనాలంతా ఆత్రుతగా ఉన్నారు. కోటి 25లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చిపడ్డాయంటే జనాలు ఎంత ఆశగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

సంక్షేమ పథకాలకు అర్జీలు పెట్టుకునేందుకు జనం తీవ్ర అవస్థలు ప‌డ్డారు. గంటల తరబడి లైన్లలో నిలుచున్నారు. సొంతూళ్లలోనే దరఖాస్తులు ఇవ్వాలన్న ప్రచారంతో పనికోసం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వాళ్లంతా సొంతూళ్లకు వెళ్లారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చే సమయంలో అధికారులు, ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు.

ఆధార్ అప్డేట్‌ చేసుకోవాలంటా, గ్యాస్‌ కనెక్షన్‌కు కేవైసీ ఉండాలంటా, కొత్తగా రేషన్‌ కార్డులు అప్లయ్ చేసుకున్నవాళ్లకు పథకాలు రావంటూ అని చాలా గందరగోళాలు నడిచాయి. జనం కూడా ఈ ప్రచారాలన్నింటినీ నమ్మి ఆధార్‌ సెంటర్లు, గ్యాస్ ఏజెన్సీల ముందు రోజుల తరబడి క్యూ కట్టారు. మొత్తానికి కిందామీదా పడి మెజారిటీ జనం అన్నీ అప్డేట్‌ చేసుకున్నాకే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు.

ఎన్నో వ్యయ, ప్రయాసల కోర్చి మీరిచ్చిన దరఖాస్తులు ఇప్పుడు ఎక్కడున్నాయి?. అసలు వాటిని ఎలా తరలిస్తున్నారు?. ఉన్నతాధికారుల వద్దకు అవి సేఫ్‌గానే చేరాయా?. అంటే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటన చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవక తప్పదు. కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద ప్రజా దరఖాస్తు ఫాములు రోడ్డుపై కనిపించడం చర్చనీయాంశమైంది.

మ్యాటర్‌లోకి వెళ్తే.. కూకట్‌పల్లి వై జంక్షన్‌ దగ్గర ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. వెనకాల ఓ అట్టపెట్ట ఉంది. అది చినిగిపోవడంతో ఒకేసారి ఆ పేపర్లన్నీ రోడ్డుమీద చిందర వందరగా ఎగిరిపడ్డాయి. దీంతో బైక్ పక్కకు ఆపి ఆ పేపర్లన్నింటినీ యువకుడు సేక‌రిస్తున్నాడు. ఇది గమనించిన జనాలు.. అటు వైపుగా వెళ్లి ఆ పేపర్లను చూశారు. అవి ప్రజాపాలన దరఖాస్తులు అని తెలిసి అంతా షాక్ అయ్యారు. ఎవరు నువ్వు?. ప్రజాపాలన దరఖాస్తుల్ని బైక్‌పై ఎందుకు తీసుకెళ్తున్నావు? వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావని నిలదీశారు. ఎవరో ర్యాపిడోలో బుక్‌ చేశారని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. బైక్‌పై వెళ్తుండగా అట్టపెట్టె చిరిగి దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయని చెప్పాడు. తనకు ఇంతకుమించి ఏం తెలియదని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ అట్టపెట్టెలో 500కు పైగా దరఖాస్తులు ఉన్నాయి. వాటిపై హయత్‌నగర్‌ సర్కిల్‌ పేరు రాసి ఉంది. అసలు సంబంధమే లేని ప్రాంతానికి అవి ఎందుకొచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో విషయం ఏంటంటే అధికారులకు కేవలం అవి దరఖాస్తు పత్రాలే కావొచ్చు. కానీ పేదలు, సామాన్యులకు అవే భవిష్యత్తు. దరఖాస్తు ఫాముల్ని ప్రభుత్వం పరిశీలించి తమకు లబ్ధి చేకూరుస్తుందని ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో దరఖాస్తు ఫాముల్ని ఇలా బైక్‌లపై నిర్లక్ష్యంగా తరలించడంపై విమర్శలొస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News