ఘనంగా మొదలైన బోనాల పండగ
లంగర్ హౌస్ నుంచి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం వరకు కొనసాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు పూజలు నిర్వహించారు.
తెలంగాణలో బోనాల పండగ ఘనంగా మొదలైంది. ఆషాఢ మాసం సందర్భంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలు మొదలయ్యాయి. బోనాల ఉత్సవం తొలి రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు.
లంగర్ హౌస్ నుంచి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం వరకు కొనసాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు పూజలు నిర్వహించారు. నెలరోజులపాటు నగరంలో బోనాల పండగ సంబరాలు జరుగుతాయి. భారత దేశంలో హిందువుల గురించి చాలామంది మాట్లాడతారు కానీ హిందువుల పండుగలకు సహకరించేది కేసీఆర్ మాత్రమేనని అన్నారు మంత్రి తలసాని. అన్ని విభాగాల సమన్వయంతో బోనాల జాతర నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడక ముందు అతి తక్కువ మందితో గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల జాతర జరిగేదన్నారు. ఇప్పుడు లక్ష మందికి పైగా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు.
జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. జూలై 10న ఊరేగింపు నిర్వహిస్తారు. పాతబస్తీలో బోనాల ఉత్సవం జూలై 16న ప్రారంభమవుతుంది, మరుసటి రోజు జూలై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహిస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022 వరకు బోనాల నిర్వహణకు కేసీఆర్ ప్రభుత్వం రూ.78.15 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ప్రతి ఏడాది 3,033 ఆలయాలకు పంపిణీ చేస్తున్నారు.