గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
మొదట్లో ఆర్ట్స్ లవర్స్‌గా మొదలైన సంస్థ.. 1972లో జననాట్య మండలిగా మారింది. జననాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఎంతో ఉందని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది.
గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఆయన కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాము. గద్దర్ మృతిపై సంతాపం ప్రకటిస్టున్నామంటూ సీపీఐ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. గద్దర్ గుండెకు జరిగిన ఆపరేషన్ ఫెయిలై.. ఆయన మృతి చెందినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నామని.. తన మరణం రాష్ట్ర ప్రజలందరికీ ఆవేదన కలిచించిందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు.
నగ్జల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల నేపథ్యంలో అనేక పాటలు, నాటికలు, బుర్రకథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను ఉత్తేజ పరచాలని మావోయిస్టు పార్టీ (అప్పట్లో పీపుల్స్ వార్) ఒక సాంస్కృతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. మొదట్లో ఆర్ట్స్ లవర్స్‌గా మొదలైన సంస్థ.. 1972లో జననాట్య మండలిగా మారింది. జననాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఎంతో ఉందని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. 1992 నుంచి ప్రారంభమైన గద్దర్ విప్లవ ప్రస్థానం 2012 వరకు కొనసాగిందని చెప్పింది.
నాలుగు దశాబద్దాలు పీడిత ప్రజల పక్షాన నిలండి.. సీపీఐ మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా సాంస్కృతిక రంగంలో పని చేస్తూ.. విప్లవోద్యమ నిర్మాణంలో గద్దర్ విశేష కృషి చేశాడని తెలిపింది. 1972 నుంచి 2012 వరకు మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగారని.. పాటలు, కథలు, నాటకాల రూపంలో ప్రజలను చైతన్యపరుస్తూ భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నది.
తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాల్లో తొలి దశ నుంచి మలి దశ వరకు గద్దర్ పాల్గొన్నారు. మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పాటలు కూడా రాశారు. దోపిడి పాలకులు చేసిన ఎన్‌కౌంటర్లలో, బూటకపు ఎన్‌కౌంటర్లలో మరణించిన విప్లవకారుల శవాలను తమ కుటుంబాలకు చేరవేసే ఉద్యమానికి గద్దర్ నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
80వ దశకంలో గద్దర్ నాలుగేళ్ల పాటు దళ జీవితం కొనసాగించారని.. సాంస్కృతిక రంగ అవసరాన్ని పార్టీ గుర్తించి.. గద్దర్‌ను బయటకు పంపి.. జన నాట్య మండలిని అభివృద్ధి చేసే కీలక బాధ్యతలు అప్పగించినట్లు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న వర్గ పోరాటంలో ఎంతో మంది విప్లవ ప్రజానీకాన్ని, యువతీ యువకులను పాటలతో ఉర్రూతలూగించిన గద్దర్.. తన చివరి కాలంలో పార్టీ నిబంధనలకు విరుద్దంగా పాలక పార్టీలతో కలవడం బాధకరం. అందుకే ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఆయన 2012లో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశారు. దానిని పార్టీ ఆమోదించినట్లు జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.