ఆ పాపంలో నేనూ భాగమే.. వినోద్ కుమార్ హాట్ కామెంట్స్
తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు వినోద్ కుమార్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయినప్పటికీ.. ప్రజలు, ఉద్యమకాలం నాటి కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారన్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడం వల్ల తెలంగాణతో పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నంలో తాను కూడా భాగమయ్యానన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న వినోద్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలిపుడు చర్చనీయాంశమయ్యాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు వినోద్ కుమార్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయినప్పటికీ.. ప్రజలు, ఉద్యమకాలం నాటి కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారన్నారు. బీఆర్ఎస్‌లో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో యువతకు టికెట్లు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రజాక్షేత్రంలో ఉండాలన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు వినోద్. ప్రాంతీయ పార్టీలకు బతుకే లేదన్న మోడీ, ఇవాళ అదే ప్రాంతీయ పార్టీల దయతోనే ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పవర్‌లో లేకపోయినప్పటికీ.. ప్రజల్లో పవర్‌ఫుల్ పార్టీగా బతికే ఉందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పేరు మార్పుపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఓటమికి పేరు మార్పు కూడా కారణమని కొంతమంది నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతో ప్రజలతో అనుబంధాన్ని కోల్పోయామని విశ్లేషించారు. కాగా, పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నట్లు సమాచారం.