నిరుద్యోగుల్ని గుండెలపై తన్నుతారా..?

తెలంగాణలో కాంగ్రెస్ నిరుద్యోగులకు పదవులు వచ్చాయని, అసలైన నిరుద్యోగులు మాత్రం కష్టాలు పడుతున్నారని చెప్పారు హరీష్ రావు.

Advertisement
Update: 2024-06-30 08:07 GMT

నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెట్టి వారితో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే నిరుద్యోగుల్ని గుండెలపై తన్నుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగుల డిమాండ్ల సాధనకోసం ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ ను.. గాంధీ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. దీక్ష విరమించాలని బీఆర్ఎస్ తరపున కోరారు. నిరుద్యోగుల తరపున జరిగే పోరాటంలో బీఆర్ఎస్ కూడా వారితో కలసి ఉద్యమిస్తుందని భరోసా ఇచ్చారు హరీష్ రావు.


ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, బల్మూరి వెంకట్, మురళి, రేవంత్ రెడ్డి.. అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు హరీష్ రావు. బస్సు యాత్రలు కూడా చేశారని, రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకువచ్చి హామీలిప్పించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నిరుద్యోగులకు పదవులు వచ్చాయని, అసలైన నిరుద్యోగులు మాత్రం కష్టాలు పడుతున్నారని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని ప్రశ్నించారు హరీష్ రావు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు ఏపీలో ఒక పోస్ట్ కి 100మందిని ఎంపిక చేసినప్పుడు తెలంగాణలో 1:100 ఎందుకు సాధ్యంకాదని అడిగారు. కనీసం విద్యార్థుల ఆందోళనలను ప్రభత్వం పట్టించుకోకపోవడం దారుణం అని చెప్పారు. మోతీలాల్ నాయక్ గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే, కాంగ్రెస్ సర్కారుకి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు హరీష్ రావు. గ్రూప్‌-2, 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని, జీవో 46 రద్దు చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని, ప్రైమరీ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అర్హులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News