పాలమూరులో కాంగ్రెస్ కి భారీ షాక్.. బీఆర్ఎస్ లోకి ఎర్రశేఖర్
బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, ముఖ్యంగా ముదిరాజ్ ల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, వాటిని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు ఎర్ర శేఖర్.
రాజగోపాల్ రెడ్డి వచ్చేశారు, వివేక్ వెంకట స్వామి దారిలో ఉన్నారు.. అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ కి సెకండ్ లిస్ట్ తర్వాత వరుస షాకులు తగులుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఎర్రశేఖర్ వంటి కీలక నేతలు కాంగ్రెస్ ని వీడారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తాజాగా బీఆర్ఎస్ లో చేరారు. ఈ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ కి అదనపు బలం చేకూరినట్టయింది. అదే సమయంలో కాంగ్రెస్ కి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బలమైన నేత ఎర్ర శేఖర్ కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పారు ఎర్ర శేఖర్. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు ఎర్ర శేఖర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని చెప్పారు ఎర్ర శేఖర్.
బీసీలకు మేలు చేసింది కేసీఆరే..
బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, ముఖ్యంగా ముదిరాజ్ ల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, వాటిని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు ఎర్ర శేఖర్. అందుకే తాను బీఆర్ఎస్ లో చేరుతున్నానని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ముదిరాజ్ ల జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని, మత్స్య సంపద విపరీతంగా పెరిగిందని అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు ఎర్రశేఖర్.