'హిపోక్రసీ ఎందుకు నడ్డా ? మీ కర్ణాటకలో 'కమీషన్ల' పరిస్థితి చూడండి.. కేటీఆర్
హనుమకొండ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
హనుమకొండ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణాలో అవినీతి పెరిగిపోయిందంటూ నడ్డా కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయన.. 'హిపోక్రటిక్' గా మారవద్దని, మీ బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో ఎంతటి శోచనీయ పరిస్థితి ఉందో చూడాలని ట్వీట్ చేశారు. సీఎం కావాలంటే రూ. 2,500 కోట్లు, విద్యారంగంలో 40 శాతం కమీషన్, కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్, టూరిజంలో 40 శాతం, మఠాలకు గ్రాంట్లు విడుదల చేయాలంటే 30 శాతం కమీషన్ చెల్లించాల్సిందేనన్నారు. అలాంటిది మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణాలో వైద్య విద్యా సౌకర్యాల కల్పనలో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిస్తున్నారని కేటీఆర్ అన్నారు. 2014 కి ముందు.. 67 ఏళ్లలో తెలంగాణాలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని.. అయితే గత 8 ఏళ్లలో కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరయ్యాయన్నారు. మరో 13 కాలేజీలు త్వరలో ఏర్పాటు కానున్నాయన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు అన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, రామగుండం, జగిత్యాల జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం దాదాపు పూర్తయిందని తెలిపారు. సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్ధిపేట, నల్గొండ జిల్లాల్లో అప్పుడే ఇవి ప్రారంభమయ్యాయని కేటీఆర్ తెలిపారు. కొత్తగూడెంలో వైద్య కళాశాల త్వరలో ప్రారంభోత్సవానికి నోచుకోనుందని ఆయన ట్వీట్ చేశారు.