అనర్హత పిటిషన్.. దానం నాగేందర్, స్పీకర్ ఆఫీస్, ఈసీకి హైకోర్టు నోటీసులు
దానంపై తమ ఫిర్యాదును స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని కౌశిక్‌రెడ్డి తరఫు లాయర్ కోర్టులో వాదించారు.
పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కి హైకోర్టు నోటీసులు పంపింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన దానంపై మార్చి 14న తాము ఫిర్యాదు చేసినా, అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన కోర్టు దానంతోపాటు తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి, ఈసీకి కూడా నోటీసులు పంపింది.
స్పీకర్ మా ఫిర్యాదుపై స్పందించలేదు
దానంపై తమ ఫిర్యాదును స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని కౌశిక్‌రెడ్డి తరఫు లాయర్ కోర్టులో వాదించారు. స్పీకర్‌ను కలవడానికి కూడా తమకు టైమివ్వలేదని.. చివరికి రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరినందున పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాల్సి ఉందన్నారు. అనర్హతపై నిర్దిష్ట గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనిపై స్పీకర్‌కు కూడా నోటీసులు జారీ చేయాలని కోరారు.
స్పీకర్ పోస్టును అగౌరవపరచకూడదు
ఈ వాదనపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ కార్యాలయానికి నోటీసులిస్తే సరిపోతుందని, స్పీకర్‌కు ఇవ్వకూడదని, ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌పై ఒత్తిడి తేవడం కూడా సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ 2019లో పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన ఫిర్యాదులను 2023 దాకా తేల్చలేదని గుర్తుచేశారు. ఈ వాదనలన్నీ విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలంటూ దానంతోపాటు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, స్పీకర్ కార్యాలయం, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చారు.