సన్నాల పేరుతో గోల్‌మాల్‌ కట్టడి చేయండి

ధాన్యం కొన్న 48 గంటల్లోనే డబ్బులు జమ చేయండి.. అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

Advertisement
Update:2024-10-03 19:02 IST

సన్నవడ్ల పేరుతో కొనుగోలు కేంద్రాల్లో గోల్‌ మాల్‌ ను కట్టడి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. గురువారం సెక్రటేరియట్‌ నుంచి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, డీఎస్సీ నియామకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సీజన్‌ నుంచే సన్నవడ్లకు క్వింటాల్‌ కు ఎమ్మెస్పీ కన్నా రూ.500 అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తామన్నారు. రైతుల ధాన్యం కాంటా అయిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఇప్పటికే 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, కలెక్టర్లు ఇంకా ఎక్కడైనా అవసరమైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 140 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని అధికారులు వివరించారు. సన్నవడ్లు కొనేప్పుడు నిర్దేశిత ప్రమాణాలు తప్పకుండా పాటించాలన్నారు. అధికారులు ఏమాత్రం అలర్ట్‌ గా లేకున్నా గోల్‌మాల్‌ జరిగే అవకాశముందన్నారు. అలాంటి తప్పులకు తావివ్వొద్దన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి నంబర్‌ కేటాయించాలని, కొన్న వడ్ల సంచులపై ఆ కేంద్రం నంబర్‌ వేయాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి చేయాలన్నారు. తరుగు, తేమ, తాలు పేరుతో రైతులు మోసం చేసే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు. కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వర్షాలకు తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోళ్లపై 24 గంటలు అందుబాటులో ఉండేలా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. డిఫాల్ట్‌ మిల్లర్లకు ధన్యం ఇవ్వొద్దన్నారు. ఈనెల 5వ తేదీలోగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలన్నారు. 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్‌ శాంతికుమారి, సివిల్​ సప్లయిస్​ ఎండీ డీఎస్​ చౌహాన్​, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు రఘునందన్​ రావు, బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News