కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలో రెండుగా విడిపోయిన కాంగ్రెస్

రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడటంపై కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ గొడవ ఢిల్లీకి చేరింది.

Advertisement
Update:2022-07-28 18:43 IST

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. వారం పది రోజుల్లో తన రాజకీయ కార్యచరణను రాజగోపాల్ రెడ్డి ప్రకటించనున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు బలమైన అనుచరగణం ఉన్నది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో వీరి మాటకు విలువిచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. తమ్ముడు వెళ్లినా తాను మాత్రం పార్టీలోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. కానీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం కాంగ్రెస్‌కు ఇబ్బందేననే వార్తలు వస్తున్నాయి.

రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడటంపై కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ గొడవ ఢిల్లీకి చేరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సహా కొందరు ముఖ్య నేతలు బుధవారం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్‌ వద్ద రాజగోపాల్ రెడ్డి పంచాయితీ మీద చర్చ జరిగింది. మునుగోడు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికే ఈ భేటీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ అక్కడ సమావేశంలో ఈ విషయంపై రెండు వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం.

ఢిల్లీకి వెళ్లక ముందు మల్లు భట్టివిక్రమార్క ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డితో బేటీ అయ్యారు. పార్టీని వదలి పోవద్దని సముదాయించారు. భట్టి మాట్లాడిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని భట్టి ఢిల్లీలో కూడా ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి ప్రయత్నిస్తోందని వివరించారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోనే కాస్త ఉనికిని చాటుకుంటున్న బీజేపీ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను చేర్చుకొని దక్షిణ తెలంగాణలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తోందని భట్టి చెప్పుకొచ్చారు.

భట్టితో పాటు మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం చూపగలరని, వారిని వదిలేసుకోవడం అంటే కోరి నష్టాన్ని తెచ్చుకోవడమే అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై అధిష్టానంతో భట్టి, ఉత్తమ్ గట్టిగానే వాదించారు. అదే సమయంలో అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ మాట్లాడలేదని తెలుస్తున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటే ఉండనీ.. పోతే పోనియ్ అనే ధోరణిలోనే రేవంత్ వ్యవహరించారని.. మొదటి నుంచి వారితో విభేదాలు ఉన్న రేవంత్ వారిని బుజ్జగించడాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తున్నది.

రేవంత్‌పై కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి వ్యతిరేక గళమే వినిపిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారంటూ గతం ఆరోపించారు. అప్పటి నుంచి ఆ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోతే మునుగోడులో ప్రత్యామ్నాయాలను కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే సిద్దం చేసి పెట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. ఢిల్లీలో కూడా ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్‌ను బుజ్జగించాల్సిన అవసరం లేనది అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తున్నది.

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ చీఫ్ ఈ విషయంలో రెండు వాదనలు వినిపిస్తుండటంతో అధిష్టానం కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నది. సస్పెన్షన్ వేటు వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలు అవుతుందని.. వెళ్తే వెళ్లనిద్దాం.. ఉంటే గౌరవిద్దాం అంటూ కొందరు నాయకులు సూచించినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News