దేశంలో నిరుద్యోగ సమస్యకు కాంగ్రెస్, బీజేపీలే కారణం.. మంత్రి కేటీఆర్ ఫైర్

ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్‌ను ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకొని.. తెలంగాణ ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించి తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు.

Advertisement
Update:2023-05-07 19:35 IST

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఒక పాలసీ అంటూ లేదని.. ఆ రెండు పార్టీలకు ఒక విధానమంటూ ఉండుంటే దేశంలో నిరుద్యోగ సమస్య అంటూ ఉండేది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు గాను.. కాంగ్రెస్, బీజేపీలు యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందించారు.

ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్‌ను ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకొని.. తెలంగాణ ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించి తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలోని రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంకా గాంధీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఒకప్పుడు సోనియా గాంధీని బలి దేవత అన్న వ్యక్తే.. ఇవ్వాళ టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించి.. కాంగ్రెస్ పార్టీ తమ అంతానికి ఆ పార్టీనే వీలునామా రాసుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీది అమాయకత్వమో.. ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలి కేటీఆర్ అన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో 9 ఏళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్‌తో ఉందని కేటీఆర్ అన్నారు. తొమ్మదేళ కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా మారిందని చెప్పారు. తప్పుడు కేసులు వేసి ప్రాజెక్టులను ఆపిన సొంత పార్టీ నాయకులకు ప్రియాంకా గాంధీ బుద్ది చెప్పాలని కోరారు. ప్రభుత్వ రంగంలో 2.2 లక్షలు, ప్రైవేటు రంగంలో 22 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వానిదే అని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు రాష్ట్రంలోని యవతకు కల్పించనున్నామన్నారు.

Tags:    
Advertisement

Similar News