లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఫైనల్.. ఆ 4 సీట్లు వారికే..?
చెన్నూరు నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించాలన్న ప్రతిపాదనను స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెన్నూరు టికెట్ కోసం కాంగ్రెస్‌లో పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. వారికి కేటాయించే స్థానాలు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సీపీఐకి చెన్నూర్, కొత్తగూడెం స్థానాలు.. సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి.. సీపీఐ నేత రేగుంట చంద్రశేఖర్ చెన్నూర్ నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇక మిర్యాలగూడ నుంచి సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, వైరా నుంచి భూక్యా వీరభద్రం పోటీ చేయనున్నారు.
అయితే చెన్నూరు నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించాలన్న ప్రతిపాదనను స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెన్నూరు టికెట్ కోసం కాంగ్రెస్‌లో పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణతో మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గెలవలేని సీటు నుంచి సీపీఐ ఎందుకు పోటీ చేస్తుందని నారాయణను ప్రశ్నించారు ఫయాజ్. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీపీఐ అభ్యర్థి గెలవగల స్థానాన్ని ఎంచుకోవాలని నారాయణకు సూచించారు. అయితే మీకు అభ్యంతరాలుంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని సంప్రదించాలని, సీపీఐని కాదని కాంగ్రెస్ నేతకు నారాయణ సూచించారు.