సీఎం రేవంత్ రెడ్డిపై..బంజారాహిల్స్‌లో బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును బుల్డోజర్లతో తొక్కిస్తానని సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడటంపై బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును బుల్డోజర్లతో తొక్కిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడటంపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిపై హైదరాబాద్‌లో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం బెదిరింపులతో తమ నాయకుల భద్రతపై తమకు ఆందోళన కలుగుతున్నదని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీపు చింతపండు చేస్తా.. బుల్డోజర్లు ఎక్కించి తొక్కుతా అని మా నేతలు కేటీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా.. రేవంత్ బండ బూతులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ పై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.చిన్న పోస్టు పెడితేనే మా సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. తొక్కుతా చంపుతా అంటూ సీఎం స్థాయిలో బజారు భాష మాట్లాడం వల్ల కింది స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలను హింస చేయడానికి ప్రేరేపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి భాష వల్లే మా నేతలపై దాడులు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మంలో హరీశ్ రావుపై, ముషీరాబాద్ లో కేటీఆర్ పై, కొండాపూర్ లో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడులు రేవంత్ చేయించిన దాడులే అని తెలిపారు. రేవంత్ తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే భాద్యత వహించాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు.