గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరాన ప్రకటించిన సీఎం స్టాలిన్
ఫిడే ప్రపంచ చెస్ విజేత దొమ్మరాజు గుకేశ్‌కు తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ 5 కోట్లు క్యాష్ ప్రైజ్ ప్రకటించారు
ఫిడే ప్రపంచ చెస్ విజేత దొమ్మరాజు గుకేశ్‌కు తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ 5 కోట్లు క్యాష్ ప్రైజ్ ప్రకటించారు. సింగపూర్‌లో జరిగిన వరల్డ్ చెస్ టోర్నీలో గుకేశ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు సీఎం స్టాలిన్. వరల్డ్ టైటిల్ సాధించిన గుకేశ్‌ను ఆయను అభినందించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన సూచనను స్వీకరిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. చెస్ టైటిల్ విజేత గుకేశ్‌కు 5 కోట్ల క్యాష్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు. 18 ఏళ్ల వయసులోనే చాంపియన్ అయ్యాడు గుకేశ్. ఆ టైటిల్‌ను అందుకున్న అతిపిన్న వయస్కుడిగా అతను రికార్డు సృష్టించాడు. వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన గుకేశ్ ఖాతాలో ప్రైజ్‌మనీ కూడా భారీగా చేరనుంది.
14 రౌండ్లపాటు సాగిన ఈ చాంపియన్‌షిప్ మొత్తం ప్రైజ్‌మనీ 2.5 మిలియన్ డాలర్లు (రూ.21.22 కోట్లు). అలాగే ఫిడే నిబంధనల ప్రకారం ఇందులో ఒక్కో రౌండ్ గెలిచిన విజేతకు రూ.1.69 కోట్లు లభిస్తాయి. కాబట్టి ఈ చాంపియన్‌షిప్‌లో మూడు గేమ్‌లు గెలిచిన గుకేశ్ రూ.5.07 కోట్లు సాధించాడు. లిరెన్ రెండు గేమ్‌లు గెలవడంతో అతడికి రూ.3.38 కోట్లు దక్కాయి. ఇక మిగిలిన 1.5 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని ఇరువురికి సమానంగా పంచారు. దీంతో గుకేశ్‌కు మొత్తంగా రూ.11.45 కోట్లు లభించగా.. రన్నరప్‌గా నిలిచిన లిరెన్‌కు రూ.9.75 కోట్లు అందాయి.