మళ్లీ ఢిల్లీకి రేవంత్.. ఇవాళైనా అభ్యర్థులు ఫైనల్ అవుతారా..?
వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం.. ఈ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వరంగల్, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వారం రోజుల వ్యవధిలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది రెండో సారి. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హస్తిన పర్యటనకు బయల్దేరి వెళ్తారు.
ఇవాళ జరగనున్న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ సమావేశంలో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్‌తో చర్చిస్తారు. తెలంగాణలో ఇప్పటివరకూ 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మరో 4 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం.. ఈ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వరంగల్, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. వరంగల్ నుంచి కడియం కావ్య, ఖమ్మం నుంచి పొంగులేటి వియ్యంకుడు, మాజీ ఎంపీ ఆర్.సురేందర్ రెడ్డి తనయుడు రఘురామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక కరీంనగర్‌లో అభ్యర్థి ఎవరనే విషయంపై కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది. ఇక ఈ నెల 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ సభ నుంచే జాతీయ స్థాయి మేనిఫెస్టోను ప్రకటించనుంది.