తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి స్థల పరిశీలన.. రేవంత్ నష్టనివారణ చర్యలు

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హడావిడి పడుతున్నారు. స్థల పరిశీలన పూర్తి చేసి, నష్టనివారణ చర్యలు చేపట్టారు.

Advertisement
Update: 2024-08-20 16:40 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి సిద్ధమయ్యారు. అయితే సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు కూడా కొనసాగుతోంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రకటించడమే కాదు, ఆఘ మేఘాల మీద స్థల పరిశీలన కూడా పూర్తి చేశారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితోపాటు సచివాలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలాన్ని పరిశీలించారు. విగ్రహం చుట్టూ ఉండాల్సిన డిజైన్ పై కూడా అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని సీఎం ప్రకటించారు.


తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు రాజకీయ కలకలం రేపింది. విగ్రహ ఏర్పాటు సరికాదని బీఆర్ఎస్ అంటోంది, తాము అధికారంలోకి వస్తే ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడినుంచి తొలగిస్తామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటికి కేటీఆర్ కౌంటర్లు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటేరియట్ లో ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, హడావిడిగా స్థల పరిశీలన జరపడం విశేషం.

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుతో ఏమాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం సముచితం కాదని కవులు, కళాకారులు, పాత్రికేయులు, బుద్ధిజీవులు.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం సరైన చర్య అని వారు ఆ లేఖలో సూచించారు. దీంతో ఈ వ్యవహారంపై అధిష్టానం ఆరా తీసినట్టుంది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హడావిడి పడుతున్నారు. స్థల పరిశీలన పూర్తి చేసి, నష్టనివారణ చర్యలు చేపట్టారు. 

Tags:    
Advertisement

Similar News