అప్పులు చేస్తున్నాం, కానీ..!
సాంకేతికత కారణంగా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని, ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కౌంటర్లు ఏర్పాటు చేసి, అలాంటి వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆదాయం సర్ ప్లస్ లో ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సగటున రోజుకి 200 కోట్ల రూపాయల అప్పు చేస్తోందని, తెలంగాణ ప్రజలపై భారం మోపుతోందని ఇటీవల గణాంకాలతో సహా ప్రతిపక్షం విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కలను ఒప్పుకుంటూనే అప్పులకు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన ఆయన.. నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందన్నారు. దేశానికి కాంగ్రెస్ ఎన్నో సేవలు చేసిందని చెప్పారు.
అమెరికా పర్యటనలో తాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం అయ్యానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం మోపిందని, తాము తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుంటున్నామని చెప్పారు. వడ్డీ లెక్కలు చెప్పినా, అప్పుల విషయంలో ఆయన నిజాలను ఒప్పుకోక తప్పలేదు.
సాంకేతికత కారణంగా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని, ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కౌంటర్లు ఏర్పాటు చేసి, అలాంటి వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు రేవంత్ రెడ్డి.ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేశామని, ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తెచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తామన్నారు. స్కిల్ వర్శిటీకి ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్‌గా నియమించామని చెప్పారు. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలని, ఫ్యూచర్ స్టేట్ గా మారుస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.
అర్హులకు మాత్రమే..
త్వరలోనే రైతు భరోసా పంపిణీ మొదలు పెడతామంటూ మరో గుడ్ న్యూస్ చెప్పారు రేవంత్ రెడ్డి. అర్హులైన అన్నదాతలందరికీ రైతు భరోసా అందిస్తామంటున్న ఆయన.. గత ప్రభుత్వం అనర్హులకు కూడా ఆర్థిక సాయం చేసిందని, తాము వారిని ఏరివేస్తున్నామని చెప్పారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అంగన్వాడీలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నామని, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మిస్తామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.