ఇవాళ కొడంగల్‌కు కేసీఆర్‌.. స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న స్థానాల్లో కొడంగల్‌ ఒకటి. ఇక్కడ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పోటీలో ఉండట‌మే ఇందుకు కారణం.

Advertisement
Update:2023-11-22 10:34 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ పోలింగ్‌కు గడువు సమీపిస్తోంది. రాజ‌కీయ పార్టీలు కూడా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల‌తో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. రోజుకు 3-4 బహిరంగ సభలతో దూసుకెళ్తున్న గులాబీ బాస్‌ కేసీఆర్‌.. ఇవాళ కొడంగల్‌ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్నారు. కొడంగల్ పీసీసీ చీఫ్‌ రేవంత్ సొంత నియోజకవర్గం కావడం.. కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్ రెడ్డి ప్రత్యర్థులుగా ఉండటంతో ఇవాల్టి సభలో కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న స్థానాల్లో కొడంగల్‌ ఒకటి. ఇక్కడ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పోటీలో ఉండట‌మే ఇందుకు కారణం. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈ సారి నువ్వా, నేనా అన్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈసారి కొడంగల్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు రేవంత్‌ రెడ్డి. తాను గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే కీలక స్థానంలో ఉంటానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌ కూడా రేవంత్‌ రెడ్డిని అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా సర్వశక్తులు ఒడ్డుతోంది.

ఇక సీఎం కేసీఆర్‌ ఇవాళ మొత్తం నాలుగు ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతారు. మొదట తాండూర్‌లో పైలెట్ రోహిత్‌ రెడ్డికి మద్దతుగా నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు హాజరవుతారు. ఇప్పటివరకూ 70కి పైగా నియోజకవర్గాలను చుట్టేశారు కేసీఆర్.

Tags:    
Advertisement

Similar News