జమిలి వచ్చినా తగ్గేదే లేదు.. సిద్ధంగా ఉండాలంటూ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం!

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి మళ్లీ వస్తాం, పార్లమెంటు స్థానాలు కూడా భారీగా కైవసం చేసుకుంటామని సీఎం కేసీఆర్ ధీమాగా చెప్పినట్లు సమాచారం.

Advertisement
Update:2023-09-09 06:09 IST

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేణులు భయపడాల్సిన పని లేదని.. తెలంగాణ ఎన్నికలు విడిగా పెట్టినా, జమిలిలో పెట్టినా అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా ధీటుగా ఎదుర్కుందామని పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా జమిలి ఎన్నికల పైనే చర్చ జరిగినట్లు తెలుస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో జరుగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. అప్పటి వరకు వేచి చూద్దాం. తెలంగాణ ఎన్నికలను పార్లమెంటు ఎన్నికలతో జరిపినా.. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయినా అందుకు సిద్ధంగా ఉందామని చెప్పినట్లు సమాచారం. జమిలి ఎన్నికలు జరిగితే తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితిని రెండు నెలలు అదనంగా పొడిగించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ రెండు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశాము. రెండు నెలల సమయం అదనంగా లభిస్తే మనకే మంచిది. మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని ఎవరూ నిరాశ, ఆందోళన పడవద్దని కేసీఆర్ చెప్పారు. జమిలి ఎన్నికలతో బీజేపీ, నరేంద్ర మోడీ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అయితే వారి ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం ఉంవదు. కాబట్టి నాయకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తున్నది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి మళ్లీ వస్తాం, పార్లమెంటు స్థానాలు కూడా భారీగా కైవసం చేసుకుంటామని కేసీఆర్ ధీమాగా చెప్పినట్లు సమాచారం.

గత ఎన్నికల్లో ఓడిపోయినా లోక్‌సభ స్థానాలపై కూడా కేసీఆర్ సమీక్ష చేసినట్లు తెలుస్తున్నది. ఆయా లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించినా.. ఎంపీలుగా మాత్రం గెలవలేకపోవడంపై మరోసారి కారణాలు విశ్లేషించారు. ఈ సారి తప్పకుండా పూర్తి స్థాయిలో పార్లమెంటు సీట్లు గెలుచుకునేలా వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని.. భారీగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు గెలుచుకొని మరో ఐదేళ్ల పాటు బీఆర్ఎస్ సుస్థిర పాలన అందించేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News