అర్చకులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. 65 ఏళ్లు దాటిన వారికి రూ.5వేల భృతి

వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచుతున్నామని తెలిపారు. ఈ భృతిని పొందే అర్హత వయస్సును కూడా 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Update:2023-05-31 13:39 IST

అర్చకులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో వేద శాస్త్ర పండితులకు ప్రస్తుతం అందిస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపనపల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వహితం, సర్వజన సుఖం బ్రాహ్మణ వంతు.. అందుకే బ్రాహ్మణులను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే విప్రహిత బ్రాహ్మణ సదన్ భవనాన్ని 9 ఎకరాల్లో నిర్మించామని చెప్పారు. ఇకపై బ్రాహ్మణులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడి సదన్‌లో నిర్వహించుకోవచ్చని చెప్పారు.

రాబోయే రోజుల్లో ఇక్కడ లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొల్చాలలో సంస్కృత భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని కేసీఆర్ వివరించారు. బ్రహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచుతున్నామని తెలిపారు. ఈ భృతిని పొందే అర్హత వయస్సును కూడా 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ప్రస్తుతం ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మరో 2,796 దేవాలయాలకు విస్తరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దూపధీప నైవేద్య పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.ఇకపై ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న రూ.2 లక్షలను ఇకపై యాన్యువల్ గ్రాంట్‌గా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ చెప్పారు. అనువంశీక అర్చకుల సమస్యలను కూడా త్వరలోనే కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు. పేద బ్రాహ్మణుల ఆత్మ బంధువుగా, లోక కల్యాణకారిగా, వైదిక క్రతువుల కరదీపికగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలోని ఈ విప్రహిత సదన్ వెలుగొందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు.


Tags:    
Advertisement

Similar News