ఖమ్మం మీద ప్రత్యేక దృష్టిపెట్టారా..?

ఇప్పటికే ఎన్నికల ప్రచార సభల్లో సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం పాల్గొన్నారు. ఈరోజు మళ్లీ దమ్మపేట, బూర్గంపాడు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు.

Advertisement
Update:2023-11-13 11:02 IST

మ‌రికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టిపెట్టినట్లే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ జిల్లా పెద్దగా కేసీఆర్ కు అచ్చిరాలేదు. ఎందుకంటే.. యావత్ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచినా, ఖమ్మం జిల్లాలో మాత్రం దాని ప్రభావం కనబడలేదు. మొదటి నుండి ఈ జిల్లాపై సీమాంధ్ర ప్రభావం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఖమ్మం జిల్లాపైన కృష్ణా, గోదావరి జిల్లాల ప్రభావం చాలా ఎక్కువ. అందుకనే ఒకరకంగా కేసీఆర్ కూడా జిల్లాను వదిలిపెట్టేశారు.

ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను జనాలు ఆదరించలేదు. తెలంగాణ మొత్తం 2018లో మంచి ఫలితాలు వచ్చినా ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించిన ఫలితాలు దక్కలేదు. 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గెలిస్తే, పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. మిగిలిన ప్రజా ప్రతినిధులంతా ఇతర పార్టీల్లో నుంచి బీఆర్ఎస్ లో చేరినవారే.

అందుకనే చరిత్రను జాగ్రత్తగా పరిశీలించిన కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో మాత్రం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు అర్థ‌మవుతోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచార సభల్లో సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం పాల్గొన్నారు. ఈరోజు మళ్లీ దమ్మపేట, బూర్గంపాడు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. తొందరలోనే మధిర, వైరా, ఇల్లెందు నియోజకవర్గాల్లో కూడా పర్యటించేందుకు షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. జిల్లాలో 10 సీట్లున్నప్పటికీ కనీసం ఐదు నియోజకవర్గాల్లో గెలవాలని కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారని సమాచారం.

ఖమ్మం జిల్లాలో గనుక ఐదు సీట్లు గెలవగలిగితే మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారట. ఇందులో భాగంగానే ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టిపెట్టారు. నియోజకవర్గాల్లోని నేతల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించటం కోసం మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. తుమ్మల, పొంగులేటి పోటీచేస్తున్న ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మానసికంగా పైచేయి సాధించేందుకు కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తనవంతు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా చివరి ఫలితం ఎలాగుంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News