తెలంగాణ పల్లెలకు సీఎం కేసీఆర్ జీవం పోశారు : మంత్రి కేటీఆర్
పల్లె ప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని.. దీని ద్వారా తెలంగాణ పల్లెలకు జీవం పోశారని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మా గాంధీ ఆశయమే స్పూర్తిగా.. సీఎం కేసీఆర్ తెలంగాణలోని గ్రామాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదాన్ని నిజం చేయడమే లక్ష్యంగా జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేశారని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు పల్లె ప్రగతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ క్రమంలో తెలంగాణ పల్లెలపై సీఎం కేసీఆర్ చూపుతున్న శ్రద్దను కేటీఆర్ వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని.. దీని ద్వారా తెలంగాణ పల్లెలకు జీవం పోశారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. నాడు దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ పల్లెలు.. నేడు దర్జాగా కాలర్ ఎగురవేస్తున్నాయని అన్నారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ఊరు ఇవాళ సకల సౌకర్యాలతో వెలిగిపోతోందన్నారు.
తెలంగాణ పల్లెలు ఇప్పుడు స్వయం సాధికారత సాధించి.. గ్రామ స్వరాజ్యం అనే నినాదాన్ని నిజం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలోని గ్రామాల స్వరూపాన్నే మార్చాయి. స్వచ్ఛమైన, పచ్చని, స్వయం సాధికారిక గ్రామాలు.. ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ప్రతీ పల్లెసీమ.. ప్రగతి సీమగా మారాయని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
దేశంలో ఓడీఎఫ్ + పల్లెలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ పల్లెలు నూతన శోభను సంతరించుకుంటున్నాయని చెప్పారు. జాతీయ పంచాయత్ రాజ్ అవార్డుల్లో ఎక్కువగా తెలంగాణ గ్రామాలకే వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన నీరు మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు.