ఓయూలో హాస్టళ్ల మూసివేత.. రేవంత్, భట్టిలకు కేసీఆర్ కౌంటర్
గత 4 నెలలుగా విద్యుత్, సాగు నీరు, తాగు నీటి సరఫరాపై తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్ల మూసివేత సర్క్యూలర్ కాస్త పొలిటికల్ రచ్చకు దారి తీసింది. నీరు, విద్యుత్ కొరత కారణంగా మే 1 నుంచి 31 వరకు హాస్టల్స్ మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ పేరిట నోటీసు బయటకొచ్చింది. ఈ నోటీసుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇదే అంశంపై ట్వీట్ చేశారు గులాబీ బాస్ కేసీఆర్. గత 4 నెలలుగా విద్యుత్, సాగు నీరు, తాగు నీటి సరఫరాపై తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. తాజాగా ఉస్మానియా వర్సిటీ చీఫ్ వార్డెన్ నోటీసు చూస్తే సీఎం, డిప్యూటీ సీఎంల వాదనలన్నీ ఉత్తివేనని అర్థమవుతుందన్నారు. తెలంగాణలో విద్యుత్‌తో పాటు తాగునీరు, సాగు నీరు కొరత ఉన్న మాట వాస్తవమేనన్నారు కేసీఆర్.
బస్సు యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్న టైమ్‌లో రెండు సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ ఆరోపించగా.. సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేవని చెప్పుకొచ్చారు. తాజాగా ఓయూ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసు.. కేసీఆర్ ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది.