తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి 'చాట్ బాట్'.. దేశంలోనే రెండో రాష్ట్రంగా రికార్డు
ఓటర్లు అడిగే ప్రతీ సందేహానికి, సమస్యకు తక్షణమే జవాబు చెప్పేలా దీన్ని రూపొందించారు.
తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు వారాల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల సన్నాహలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది.
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో టెక్నాలజీని వాడుకోనున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కొత్త తరం ఓటర్లను, తొలి సారి ఓటు వేస్తున్న వారిని ఆకట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకున్నది. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయడానికి ముందు అనేక సందేహాలు, ఫిర్యాదులు ఉంటుంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ఎక్కడకు వెళ్లాలో చాలా మందికి తెలియదు. అలాగే కొంత మంది ఆఫీసుల చుట్టు తిరగడానికి బద్దకిస్తుంటారు. అలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్ 'చాట్‌బాట్'ను ఆవిష్కరించింది. ఓటర్లు అడిగే ప్రతీ సందేహానికి, సమస్యకు తక్షణమే జవాబు చెప్పేలా దీన్ని రూపొందించారు.
ఓటర్ ఐడీల దగ్గర నుంచి పోలింగ్ బూత్ వరకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ చాట్‌బాట్‌ను సంప్రదించవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు. దేశంలో ఇలాంటి చాట్‌బాట్ వాడకాన్ని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనున్నది. గతంలో హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో చాట్‌బాట్‌ను ఉపయోగించారు. ఇప్పుడు టెక్నాలజీలో ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఇటీవలే ఒక పోల్ ప్యానల్ ఒక చాట్ బాట్‌ను రూపొందించింది. ఇందులో మనుషులతో చాట్ చేయడానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి బాట్‌ను రూపొందించారు. ఓటర్లకు వచ్చే అనేక సందేహాలను ముందుగానే నిక్షిప్తం చేసి పెట్టారు. ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వకుండా స్వయంగా ఎలక్షన్ కమిషన్ టెక్నికల్ టీమ్ ఈ చాట్‌బాట్‌ను రూపొందించింది. ఇది లైవ్ ఇంటరాక్షన్ కాకపోయినా.. ఓటర్ల సందేహాలన్నింటినీ తీరుస్తుందని అధికారులు వెల్లడించారు.
మనిషికి, మెషిన్‌కు మధ్య ఈ చాట్‌బాట్ అనుసంధానకర్తగా ఉండనున్నది. యూజర్ క్వయిరీస్‌ను సందేశాల రూపంలో తిరిగి పంపిస్తుంది. ఇందులో మెనూ బటన్స్ కూడా ఉపయోగించారు. అలాగే మనకు కావలసిన భాషలో చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశం ఉన్నది. కీవర్డ్ రికగ్నైజేషన్‌ను కూడా ఇందులో డెవలప్ చేశారు. దీంతో పూర్తిగా ప్రశ్న అడగక పోయినా.. దానికి సంబంధించిన ఒక కీవర్డ్ ఉపయోగించినా పూర్తి సమాచారం మనకు అందించనున్నది.
ఓటు హక్కును ఎలా నమోదు చేసుకోవాలి, ఓటర్ ఐడీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి, సంబంధిత పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది, ఓటర్ స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి వంటి పనులన్నీ చాట్‌బాట్ చేసిపెడుతుంది. అంతే కాకుండా.. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే క్యాండిడేట్లు ఎవరు? వారు సమర్పించిన అఫిడవిట్ ఏంటి అనే విషయాలను కూడా ఓటర్లు తెలుసుకునే వీలుంది. ఈ చాట్‌బాట్‌ను త్వరలోనే లాంఛ్ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు ఈ చాట్‌బాట్‌ను ఉపయోగించుకునే వీలున్నది. ఓటర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొని.. దీనిని భవిష్యత్‌లో మరింత మెరుగు పరుస్తారని అధికారులు తెలిపారు.