'ఇంటింటికి తెలుగుదేశం' ప్రారంభించిన చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల బరిలో తొలి రెండు సీట్ల ప్రకటన!
ఎన్టీఆర్ ఈ తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. మరోసారి అందరూ సమిష్టిగా కృషి చేసి టీడీపీకి పూర్వ వైభవంత తీసుకొని రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుంచి ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'ఇంటింటికీ తెలుగుదేశం' ప్రోగ్రామ్‌ను ఎన్టీఆర్ భవన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణలో ప్రతీ ఒక్కరు టీడీపీని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని చంద్రబాబు అన్నారు. యువతకు, మహిళలకు టీడీపీ పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు వారి కోసమే టీడీపీ పని చేస్తోందని చెప్పారు.
ఎన్టీఆర్ ఈ తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. మరోసారి అందరూ సమిష్టిగా కృషి చేసి టీడీపీకి పూర్వ వైభవం తీసుకొని రావాలని పిలుపునిచ్చారు. దేశంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీయే అని తెలిపారు. హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కూడా టీడీపీ సొంతమని అన్నారు. తెలుగుజాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు దేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో బలోపేతం అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో..దాని ఫలాలను పేదలకు అందించడం కూడా అంతే ముఖ్యం. సంపద సృష్టించి, ఉపాది కల్పించడం.. అభివృద్ధి చేయడమే టీడీపీ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడ అని ప్రశ్నించే వారికి ఖమ్మంలో జరిగిన సభే ఉదాహరణ అని అన్నారు. ఇక్కడకు వచ్చి మాట్లాడే వారికి టీడీపీ ఎక్కడ ఉంటుందో తెలుస్తుందని అన్నారు. కాసాని నేతృత్వంలో తెలంగాణలో టీడీపీ పరుగులు పెడుతుందని చంద్రబాబు తెలిపారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ యువత తప్పకుండా టీడీపీకి అండగా ఉండాలని కోరారు. తెలంగాణలో మొదటి సీటును నాయిబ్రాహ్మణులకు, రెండో సీటు రజకులకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇన్నాళ్లూ అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు అధికారం హస్తగతం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొని రావడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని బాబు పేర్కొన్నారు. విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవడం సరి కాదని చెప్పారు. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ భవన్ చుట్టూ కాకుండా కింది స్థాయి నేతలు గ్రామాల్లో తిరిగితేనే పార్టీని కాపాడుకోవడం సులభం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న తెలుగువారి డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్‌లోనే ఈ నెల 29 ఘనంగా నిర్వహిస్తుట్లు తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.